యూపీని వణికిస్తున్న వింత జ్వరం

 ఉత్తరప్రదేశ్‌ డెంగ్యూ వణికిస్తోంది. ఉత్తర యుపిలోని ఫిరోజ్‌బాద్‌ జిల్లాలో గడిచిన 10 రోజుల్లో సుమారు 50 మంది డెంగ్యూతో చనిపోగా.. అందులో 40 మంది చిన్నారులు ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. డెంగ్యూకు తీవ్ర రూపమైన ‘ డెంగ్యూ హేమరేజిక్‌ ఫీవర్‌’ కారణంగా ఈ మరణాలు సంభవించాయని యోగి సర్కార్‌ చెబుతోంది. మరికొన్ని ఉత్తర యుపి జిల్లాలైన మధుర, ఆగ్రాల్లో కూడా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వైరల్‌ ఫీవర్లతో, డీ హైడ్రేషన్‌కు గురైన చిన్నారులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కాగా, ఈ హేమరేజిక్‌ ఫీవర్‌ చాలా ప్రమాదకరమైనదని, ప్లేట్లెట్ల సంఖ్య అకస్మాత్తుగా పడిపోతాయని, చాలా రక్తస్రావం అవుతుందని డబ్ల్యుహెచ్‌ఒ బృందం చెప్పినట్లు ఫిరోజ్‌బాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ చంద్ర విజరు అన్నారు. దీంతో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సిడిసి), నేషనల్‌ వెక్టర్‌బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌కు చెందిన నిపుణుల బృందాన్ని ఫిరోజ్‌బాద్‌కు తరలించారు. ఈ బృందం అక్కడి ఆరోగ్య శాఖ అధికారులకు సాయం చేయనుంది.