రాష్ట్రమంతటా ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం

అమరావతి : నేడు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రమంతటా పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరవీరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకొని వారికి ఘన నివాళులర్పిస్తున్నారు.

విజయవాడ : విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి హాజరయ్యారు. అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎపి పోలీస్‌ శాఖ ప్రచురించిన అమరవీరుల చరిత్ర పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దేశ రక్షణ, ప్రజా రక్షణ కోసం పోలీసులు ప్రదర్శిస్తున్న ధైర్యం, త్యాగం అభినందనీయమని ప్రశంసించారు.

ప్రకాశం (దర్శి) : అమరులైన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ.. ర్యాలీని చేపట్టారు. వారికి ఘన నివాళులర్పించారు. మరోవైపు.. పొదిలిలో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ నుండి చిన్న బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసి వారి కుటుంబానికి అండగా ఉంటామని సిఐ వి.శ్రీరామ్‌ భరోసానిచ్చారు. ఇదిలాఉండగా.. చీరాలలో పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. పోలీసు సిబ్బంది పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళం : సంతబొమ్మాళి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ఎంతోమంది పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

విజయనగరం : విజయనగరంలోని పోలీస్‌ బేరక్స్‌ లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ హరి జవహర్‌ లాల్‌ హాజరయ్యారు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్‌ అమరవీరులకు అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, తదితరులు.. ఘనంగా నివాళులు అర్పించారు.