నేటి నుండి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభకానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సమావేశాలకు ముందు సాంప్రదాయబద్దంగా నిర్వహించే అఖిల పక్ష సమావేశం రద్దు చేయబడింది. రెండు దశాబ్దాలలో అఖిల పక్ష సమావేశాన్ని రద్దు చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. కాగా, అక్టోబర్‌ 1తో ముగిసే ఈ సెషన్‌ ఎజెండాపై చర్చించేందుకు స్పీకర్‌ ఓంబిర్లా నేతృత్వంలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బిజెపి నేత అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అధిర్‌ రంజన్‌ చౌదరి, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీలు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం, జీరో అవర్‌ను తగ్గించడంపై నేడు చర్చలు జరగనున్నట్లు సమాచారం. భారత్‌ – చైనా సరిహద్దు సమస్యల, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, కరోనా మహమ్మారి నివారణలో ప్రభుత్వ వైఫల్యం సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. 2017లో జాతీయ భద్రతను ఉటంకిస్తూ.. డోక్లాంపై ప్రభుత్వం మాట్లాడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.