వినోదం నాపై బాధ్యత పెరిగింది : రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియాస్టార్‌గా మారారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా.. తండ్రి చిరంజీవితో తెరను పంచుకున్నారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో చెర్రీ ఈ చిత్ర విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను.. కొరటాల శివ ‘మిర్చి’ సినిమా తర్వాత ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. ‘రంగస్థలం’ సినిమా తర్వాత నేను కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. అదే సమయంలో నాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అవకాశమొచ్చింది. ఆ సమయంలో నేను ‘మీ సినిమాను త్వరగా కంప్లీట్‌ చేసి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తాను’ అని కొరటాల శివతో అన్నా. దానికి ఆయన వద్దన్నారు. ముందు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోనే నటించు అన్నారు. అయితే అనుకోకుండా శివ నాన్నతో ‘ఆచార్య’ మూవీ కథ చెప్పడం.. ఒకే అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిజానికి నేనీ ఈ చిత్రంలో నిర్మాతగానే ప్రవేశించాను. ఈ చిత్రంలో నాకొక పాత్ర ఉంటుందని నేనస్సలు ఊహించలేదు. మొదట్లో.. నాది, పూజాది 15 నిమిషాల నిడివిగల అతిథిపాత్రలే. స్క్రిప్టుని డెవలప్‌ చేసే క్రమంలో 40 నిమిషాల వరకు చేరింది.