వైద్య రంగానికి ఆర్‌బిఐ 50 వేల కోట్ల నిధులు..! :

కరోనా సంక్షోభంతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న భారత్‌ను గట్టెక్కించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. దేశంలో కొరవడుతున్న వైద్య రంగాన్ని ఊపిరిలూదేందుకు ..వైద్యరంగానికి నిధులను అందిస్తామని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ బుధవారం తెలిపారు. రూ.50 వేలకోట్ల మేర ఆన్‌ట్యాప్‌ నిధులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ నిధులకు మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్‌ తయారీ చేసే సంస్థలకు, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పర్చేందుకు రుణాలుగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ప్రభావితమైన వ్యక్తులకు , చిన్న, సూక్ష్మ, మధ్య తరగతుల వ్యాపారులకు వన్‌టైమ్‌ రుణాలను తిరిగి ఆర్‌బిఐ ప్రారంభించనుంది. రూ. 35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలును మే 20న ప్రారంభిస్తామని శక్తికాంతదాస్‌ చెప్పారు. చిన్న ఫైనాన్స్‌ సంస్థలకు 10 వేల కోట్ల దీర్ష కాలిక రుణాలను అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రాలకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం వ్యవధిని 50 రోజులకు పెంచారు.