వ్యాక్సిన్‌ ధరల్లో తేడా ఎందుకు? సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం

వ్యాక్సిన్‌ ధరల్లో తేడా ఎందుకు? వంద శాతం కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయదు..? వ్యాక్సినేషన్‌లో ప్రైవేటీకరణ విధానం వద్దు.. పాత విధానం అమలు చేయండి సోషల్‌ మీడియాలో సాయం కోరిన వారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారమే అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించిన సుప్రీం కోర్టు.

కరోనా వ్యాక్సిన్‌ ధరల్లో తేడా ఎందుకు ఉందని, వంద శాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయకూడదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశంలో కరోనా సంక్షోభం, నిర్వహణ అంశంపై దాఖలైన సుమోటో కేసుపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం, కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండేసి టీకా ధరలు ఎందుకు? అని ప్రశ్నించిన ధర్మాసనం, అసలు వంద శాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయట్లేదని ప్రశ్నించింది.