శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తింది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 881.30 అడుగుల్లో 195.21 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి భారీ ఎత్తున వరదను విడుదల చేసిన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 79,131 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 71,321 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి 1.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 260.59 టీఎంసీలకు చేరింది. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 18,989 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో పులిచింతలలో నీటి నిల్వ 14.98 టీఎంసీలకు చేరింది.