సుశాంత్‌ కేసు సిబిఐకి అప్పగింత!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మతి పట్ల యావత్‌ దేశ వ్యాప్తంగా అనుమానాలు వెల్లెవెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ సుశాంత్‌ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తున్నట్టు వెల్లడించింది. గత కొంత కాలంగా సుశాంత్‌ కేసు కొలిక్కి రావడం లేదు. రోజుకో ట్విస్ట్‌ బయటికి వస్తోంది. దీనికి తోడు సుశాంత్‌ కేసుని విచారిస్తున్న ముంబై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సుశాంత్‌ తండ్రి పెట్టిన కేసు విచారణ కోసం బీహార్‌ పోలీసు అధికారి ముంబై వచ్చారు. అతనికి సహకరించాల్సింది పోయి ముంబై పోలీసులు అతన్ని బలవంతంగా క్వారెంటైన్‌కి తరలించడం వివాదాస్పదంగా మారింది. దీంతో సుప్రీమ్‌ కోర్టు ముంబై పోలీసుల తీరును తప్పుపట్టింది. ముంబై పోలీసులపై విశ్వసనీయత ఉందని, కానీ ఈ కేసు విషయంలో వారిలా ప్రవర్తించడం అనుమానాలకు తావిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సుశాంత్‌ కేసు విషయంలో ముంబై పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉండటం, రియా తన కేసుని పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని కోరడం వంటి సంఘటనల నేపథ్యంలో సుశాంత్‌ తండ్రి కెకె సింగ్‌ బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ని కలిసి తన తనయుడి మరణంపై అనుమానాలున్నాయని, కేసుని సిబిఐకి అప్పగించాలని కోరారు. దీంతో నితీష్‌ ప్రభుత్వం సుశాంత్‌ కేసుని సిబిఐకి అప్పగించాలని ప్రకటన విడుదల చేసింది. దీంతో కేంద్రం ఆమోదం తెలపడం ఆసక్తికరంగా మారింది.