సుశాంత్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

సుశాంత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాచక్రవర్తి సోదరుడు, నటుడు షోయిక్‌కి డ్రగ్స్‌ సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) బుధవారం అరెస్ట్‌ చేసింది. ఈ నిందితులకు సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతో సంబంధాలు ఉన్నాయని, షోయిక్‌ సూచనల మేరకే మిరాండాకు డ్రగ్స్‌ ఇచ్చేవారని ఎన్‌సిబి తెలిపింది. షోయిక్‌, మిరాండాల మధ్య వాట్సప్‌ చాట్‌ల ఆధారంగా బాంద్రాకు చెందిన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌, అంథేరికి చెందిన జైద్‌ విలత్రాలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇద్దరు నిందితులను పోలీసుల కస్టడీని కోరుతూ కోర్టులో హాజరుపరిచినట్లు ఎన్‌సిబి తెలిపింది. శామ్యూల్‌ మిరాండా సుశాంత్‌ సింగ్‌ నివాసంలో మేనేజర్‌గా పనిచేసేవారు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహరాలు చూసేవారు. అయితే అతనిని రియానే మేనేజర్‌గా నియమించిందని సుశాంత్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, రియా ఫోన్‌లోని వాట్సప్‌ చాట్‌ల ఆధారంగా ఆమెపై ఎన్‌సిబి గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన సంగతి తెలిసిందే.