స్వర శిఖరం బాలు కు ప్రముఖుల సంతాపం..

తెలుగు పాట మధురం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంఠాన జనిస్తుంది. ఆయన పాడితే చాలు పాట ప్రాణం పోసుకొని కళ్ల ముందు కదలాడుతుంది. చెవులలో అమృతం పోసినట్లు అనిపిస్తుంది. ఎన్ని భాషల్లో విన్నా.. ఆ మధురం మారదు. ఎంత మంది కళాకారులకు ఆ గానం దారి చూపిందో.. బహు ప్రజ్ఞా సంపన్నుడాయన. బాలు లేడన్న వార్త విన్న సంగీత ప్రపంచం స్తంభించిపోయింది. దిగమింగుకోలేని కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతోంది. అభిమానుల గుండెలు అవిసిపోయాయి. ఆ స్వర శిఖరమైన బాలుని పాటలు ఎన్ని తరాలైనా శ్రోతల హృదయాలను కదిలిస్తూనే ఉంటాయి. కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి.

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడి, తెలంగాణ, ఎపి సిఎంలు కెసిఆర్‌, వైఎస్‌ జగన్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.