108,104 అంబులెన్స్ లను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేకమార్పులు తీసుకొచ్చింది. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించేందుకు ఒకేసారి  1088 వాహనాలను (108–104 కలిపి)ప్రవేశపెట్టారు.  బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సెంటర్ లో జెండా ఊపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
 పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా సర్వీసులను ప్రారంభించారు. ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది. ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌ (ఎండీటీ), మొబైల్‌ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల వైద్యసదుపాయం అవసరమైనవారిని వెంటనే చేరేందుకు అవకాశం వుంటుంది