20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకెజీ ప్రకటించిన మోడీ

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు. తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ తెలిపారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు.ఈరోజు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. 20లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. ఇది మన జీడీపీలో 10శాతం. ఈ ఆర్థిక ప్యాకేజీలో అన్ని వర్గాల వారిని పరిగణలోకి తీసుకున్నాము. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వ్యాపారులు, రైతులు.. ఉద్యోగులు శ్రామికుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకే ఈ ప్యాకేజీ. రేపటి నుంచి ఈ ప్యాకేజీకి సంబంధించి అన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.