తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో చిరుతల సంచారాన్ని చూసిన భక్తులు, టిటిడి సిబ్బంది వామ్మో..చిరుతా.. అంటూ పరుగులు తీశారు. శుక్రవారం సన్నిధానం అతిథి గృహం వద్ద, నిన్న ఘాట్‌ రోడ్డులో చిరుతలు కనిపించడంతో భక్తులు భయాందోళన చెందారు. ఈరోజు తెల్లవారుజామున అతిథిగృహం వద్ద అడవి పందుల్ని వేటాడిన చిరుత దాన్ని నోట కరచుకొని వెళ్లింది. చిరుతను చూసిన భక్తులు, టిటిడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. నిన్న మరో చిరుత రెండవ ఘాట్‌ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. కొంతసేపు చిరుత రోడ్డుకు అడ్డంగా ఉండటంతో వాహనాలను ఆపి ఆ దృశ్యాన్ని కొందరు వీడియోలు తీశారు. కాసేపటి తర్వాత చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. తిరుమలలో భక్తుల సంచారం తక్కువగా ఉండటంతో తరచూ పులులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.