సీఎం జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని ప్రాంతంలోని రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ వినతులను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతు కూలీలకు రూ. 2500 నుంచి 5 వేలు పెంచడంతో రైతులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను రైతులు వివరించారు. భేటీ అనంతరం అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. తమకు అండగా ఉంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. రైతులను సంప్రదించకుండా ఎలాంటి చర్యలు చెపట్టబోయని చెప్పినట్లు వెల్లడించారు. ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలపై పోరాడుతున్నమని, తమ వద్ద నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు మాట్లాడుతూ.. ‘తమ భూములను లాక్కుని చంద్రబాబు నాయడు అమ్ముకోవాలని ప్రయత్నించారు. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికార బలంతో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. పంట భూములను వదిలిపెట్టాలని వేడుకున్నా పట్టించుకోలేదు. లాండ్ పూలింగ్‌ పేరుతో భూములు లాక్కున్నారు. చంద్రబాబు అరాచకాలను సీఎం జగన్‌కు వివరించాము. తమ సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. భూసేకరణ నోటిఫికేషన్‌, సీఆర్‌డీఏ చట్టం, రిజర్వ్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరాం. మా వినతులపై సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు’ అని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. లాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్‌ను విత్‌డ్రా చేయాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు తెలిపారు. రిజర్వ్‌ జోన్‌ కూడా ఎత్తివేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో మంగళగిరి అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో రైతులకు తీవ్ర నష్టం జరిగే విధంగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు ధనదాహాలకు వ్యతిరేకంగా మంగళగిరి, తాడికొండ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆర్కే తెలిపారు.