హీటెక్కిన అమరావతి పోరు..నందిగం సురేష్‌ పై దాడి

హీటెక్కిన అమరావతి పోరు..నందిగం సురేష్‌ పై దాడి

రాజధాని అమరావతిలో రాజకీయం వేడెక్కింది. నెలల తరబడి రైతుల చేస్తున్న ఆందోళనలతో రాజధాని గ్రామాల్లో రోజురోజుకూ పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఆయా గ్రామాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిసిస్తే చాలు.. వివాదం ముదురుతోంది. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి సహా పలువురు నాయకులు రాజధాని రైతుల నిరసన సెగలు ఎదుర్కోగా.. తాజాగా, బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు సైతం తప్పలేదు. అయితే ఎంపీ నందిగం విషయంలో మాత్రం వివాదాస్పదమైంది. అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని నందిగం సురేష్ చెబుతుండగా.. ఎంపీ అనుచరులే తమపై దాడికి దిగినట్లు ఆ ప్రాంత మహిళలు ఆరోపిస్తున్నారు.

అమరావతిలో ఆదివారం జరిగిన రథమహోత్సవంలో పాల్గొన్న ఎంపీ నందిగం సురేష్‌ అనంతరం రోడ్డు మార్గంలో గుంటూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో లేమల్లె గ్రామంలో ఎంపీకి నిరసన సెగ తగిలింది. జై అమరావతి అంటూ నందిగం సురేష్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అయితే అమరావతి జేఏసీ ముసుగులో తమపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. మహిళలను ముందుపెట్టి టీడీపీ నాయకులు ఈ దాడి చేయించారని విమర్శించారు.