జులై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. ఈసారి రెండు వారాలే! కొత్త షెడ్యూల్ ఇదే

ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను 15 రోజులే నిర్వహించనున్నారు. అమర్‌నాథ్ యాత్ర జులై 21 నుంచి ప్రారంభమవుతుందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 21 నుంచి ఆగస్టు 3 వరకు కేవలం 15 రోజులు మాత్రమే యాత్రకు అనుమతిస్తామని తెలిపింది. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో అమర్‌నాథ్ ఒకటి. ఇక్కడికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లడం కుదరదు. హిమాలయాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ యాత్రకు అవకాశం కల్పిస్తారు.

వాస్తవానికి ఈ యాత్ర షెడ్యూల్‌ను జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకూ కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా తేదీలను మార్చి, జులై 21కు వాయిదా వేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం (ఎస్ఏఎస్బి) బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు.