అమ్మ..రాజశేఖరా..పులిహోర బాగానే కలుపుతున్నావుగా!

బిగ్ బాస్ ఐదు ఎపిసోడ్ లు పూర్తి అయిపోయాయి. మొదటి ఎపిసోడ్ పరిచయ కార్యక్రమాలు..నాగార్జున హంగామా ఆదరగోట్టేసింది. ఇక తరువాత ఎపిసోడ్ లు వినోదానికి తక్కువ..సాగదీతకు ఎక్కువ అన్నట్టు సాగాయి. హౌస్ లో ప్రారంభం నుంచీ ఇప్పటివరకూ అందర్నీ ఆకట్టుకున్న పార్టిసిపెంట్ ఎవరన్న ఉన్నారు అంటే అది ఒక్క గంగవ్వే! ఆమె ఒక్కరి కోసమే చాలా మంది ప్రేక్షకులు బిగ్ బాస్ చూస్తున్నారనిపిస్తోంది అంటే అది అతిశయోక్తి కాబోదు. ఇంకా ప్రారంభ ఎపిసోడ్ లె కదా అనుకుందామన్నా సరే.. అసలే కరోనా కాలంలో వినోదం కోసం వెంపర్లాడుతున్న ఇంటిల్లపాదినీ కదలకుండా కూచోపెట్ట గలిగే కంటెంట్ ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. గంగవ్వ ఇచ్చే వినోదం ఎన్నాళ్ళు నడుస్తుంది.. ఇక బిగ్ బాస్ లెక్కలు మారుస్తున్నాడు. అవును అది నిన్నటి నుంచే కొద్దిగా కనిపించింది.

మూడురోజులుగా నిశ్శబ్దంగా ఉన్న దివి ని ఒక్కసారిగా పైకి లేపాడు బిగ్ బాస్. అసలు దివి అలా మాట్లాడగలదా అనిపించే రేంజిలో ఆమె నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ ఆదరగొట్టేసింది. హౌస్ లో ఉన్న అందరి గురించి మాట్లాడమని చెప్పిన బిగ్ బాస్ టాస్క్ కి అదిరిపోయే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది దివి. ఎవ్వరూ నొచ్చుకోకుండా.. నొచ్చుకున్నా బయటపడలేని విధంగా మొత్తం పార్టిసిపెంట్స్ అందరినీ ఓ ఆట ఆడేసింది. దివి గురించి ప్రేక్షకులకు చాలా అంటే చాలా తక్కువ తెలుసు. అందులోనూ మొదటి మూడురోజులూ అసలు ఉందా లేదా అన్నట్టు ఉండిపోయిన ఆమె మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ ఒక్క ఎపిసోడ్ లో ఆ పరిస్థితి మారిపోయింది. బిగ్ బాస్ అంటేనే అది కదా.. ఎప్పుడు ఎవర్ని పైకి లేపుతాడో..ఎవరిని కింద పాడేస్తాడో తెలియని వినోదం.