జగన్ సర్కార్ అదిరే ట్విస్ట్.

జగన్ సర్కార్ అదిరే ట్విస్ట్.. సీఎస్‌తో ఈసీకి చెక్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నడుస్తోంది. ఆరు వారాల పాటూ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ నిర్ణయం తర్వాత రాజకీయ దుమారం రేగింది. జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇవాళ గవర్నర్‌ను రమేష్ కుమార్ కలవబోతున్నారు.. ఎన్నికల వాయిదాకు కారణాలు వివరించనున్నారు. ఇలాంటి సమయంలోనే సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు..

తమను సంప్రదించే ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్లమని లేఖలో సీఎస్ ప్రస్తావించారు. స్థానికంగా ఎవరికీ కరోనా సోకలేదని.. రానున్న మూడు, నాలుగు వారాల్లో ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని వివరించారు. సీఎస్ రాసిన లేఖకు ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం ఇస్తుందన్ని ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల వాయిదా అంశంపై సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన జీఎం జగన్.. కరోనా వైరస్‌పై తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కేవలం 60 ఏళ్లు పైబడిన వాళ్లు, డయాబెటిక్‌, బీపీ, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి వస్తే ఇది హానికరమైన వ్యాధిగా పరిగణించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టామని.. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.