ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టిన సీఎం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఇవాళ జగనన్న విద్యాదీవెన పేరుతో మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇక ఈ పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందజేయనున్నారు. రీయింబర్స్‌మెంట్‌ను నగదును విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, వారి పిల్లలు లబ్ధి పొందుతారని ఏపీ సర్కార్ వెల్లడించింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా తల్లులకు వారి పిల్లల చదువుల కోసం 11 నెలల కాలంలోనే ఏపీ ప్రభుత్వం 12 వేల వేల రూపాయలు అందిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం త్రైమాసికానికి ఒకసారి నాలుగు త్రైమాసికాలల్లో విద్యార్థుల తల్లులకు ఖాతాలల్లో జమ చేయబడుతుందని చెబుతుంది. ఈ విధంగా కళాశాలల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, కాలేజీలో స్థితిగతులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.