భూమా అఖిలప్రియ భర్తపై మరో కేసు నమోదు

నకిలీ ధ్రువపత్రాన్ని సమర్పించిన కారణంగా… ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదైంది. బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌రామ్‌, జగత్‌ విఖ్యాత్‌ ఈ నెల 3 న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కరోనా కారణంగా తాము విచారణకు హాజరుకాలేమని చెబుతూ.. ఈ నెల 1 న కోర్టులో నకిలీ ధ్రువపత్రాన్ని సమర్పించినట్లు ఇద్దరిపై అభియోగం నమోదైంది. దీంతో బోయిన్‌పల్లి పోలీసులు వీరు సమర్పించిన కోవిడ్‌ సర్టిఫికెట్లపై ఆరా తీశారు. ధ్రువపత్రాన్ని ఇచ్చిన ఆస్పత్రికి వెళ్లి విచారించగా, నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు గుర్తించారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో భార్గవ్‌రామ్‌, జగత్‌ విఖ్యాత్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ధ్రువపత్రాన్ని ఇచ్చిన ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిపైనా కేసు నమోదు చేశారు.