బద్వేల్‌ ఉప ఎన్నికపై జగన్‌ ప్రత్యేక సమావేశం

బద్వేల్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని పేర్కొన్నారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని, ఓటింగ్‌ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు.