ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేసిన తరుణంలో సీఎం లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా.. ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని జగన్ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం తెలంగాణకు వెళ్లిందని, ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.

వివిధ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్న నేపథ్యంలో.. కేంద్రం ఆర్థిక సంఘం పరిధిలోని అంశమని చెబుతోంది. కానీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉందని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని లేఖలో ప్రస్తావించిన ఏపీ సీఎం.. చొరవ తీసుకొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని కోరారు. ఈ లేఖను సీఎంవో మంగళవారం అర్ధరాత్రి మీడియాకు విడుదల చేసింది.

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉందన్న జగన్.. రాష్ట్రానికి తగిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో.. ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారన్నారు. హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నివేదికల మధ్య తేడా ఉందని సీఎం తెలిపారు. గతంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చానని ప్రధానికి రాసిన లేఖలో జగన్ ప్రస్తావించారు.