జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.10వేలు సాయం

లాక్‌డౌన్, కరోనాపై జగన్ సర్కార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.. అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా లాక్‌డౌన్‌, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్ధాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పనిచేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు అందజేసే సాయాన్ని రూ. 10 వేలకు పెంచింది. గత నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది వేట విరామ సమయం ప్రారంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అలాగే అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలు చర్యలు ప్రారంభించారని.. వారి అభివృద్దే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నట్లు చెప్పారు.