మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.

మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పోక్సో చట్టం కిందే పరిగణించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీటును ఆరు నెలల్లోపు తేల్చాలని పోక్సో స్పెషల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఆదేశించారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితులపై పోలీసుల ఛార్జ్‌షీట్‌ను గుంటూరులోని పోక్సో స్పెషల్ కోర్ట్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లైంగిక వేధింపులకు గురైన సమయంలో ఆ యువతి మైనరేనని.. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారని గుర్తుచేసింది.

2015లో వరంగల్‌కు చెందిన విద్యార్థిని రిషితేశ్వరి గుంటూరు నాగార్జున యూనివర్శిటీ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యతకు సీనియర్ విద్యార్థులతో పాటూ కాలేజీ ప్రిన్సిపాల్ కారణమనే ఆరోపణలు రాగా.. సీనియర్లైన నాగలక్ష్మి, చరణ్‌నాయక్‌, ఎన్‌.శ్రీనివాస్‌, ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాబురావుపై ఐపీసీ, ర్యాగింగ్‌ చట్టాలతో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక పోక్సో స్పెషల్ కోర్టులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు.