స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : ఆదిమూలం సురేశ్‌

 కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనూ.. తమ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నదనీ.. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ స్పష్టం చేశారు. గురువారం గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌తో కలిసి, మంత్రి సురేష్‌ ఈరోజు ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ఉన్నతవిద్యనభ్యసించే విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి. రానున్న కాలంలో ఆన్‌లైన్‌కోర్సులకు మరింత డిమాండ్‌ ఉంటుంది. అందుకే విద్యార్థులకు అందుబాటులోకి ఉన్నత విద్యలో కొత్త కోర్సులను తీసుకొస్తున్నాం.’ అని అన్నారు. అలాగే రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. పాఠశాలలకు సెలువులు ఇచ్చే ఆలోచన లేదని ఆయన అన్నారు. ఒకవేళ ఏదైనా పాఠశాలలోని విద్యార్థులకు కోవిడ్‌ సోకితే.. వెంటనే ఆ పాఠశాలను మూసివేసి.. ఆ తర్వాత ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు పరీక్షల నిర్వహిస్తున్నాయని, పరీక్షల నిర్వహణకు కోర్టు కూడా అనుమతించిందని మంత్రి సురేష్‌ తెలిపారు.