పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి ధర్మాన సవాల్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్‌ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్లని, పవన్‌ తనతో పాటు నడవగలరా? అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్‌ గ్రహించాలని ధర్మాన సూచించారు. ”సినిమాలో బొమ్మలతో యాక్షన్‌ చేస్తారు. పవన్‌ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. నాతో నడవమనండి.. కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదు” అని ధర్మాన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో మంత్రి ధర్మాన ‘గడపగడపకు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో కనిపించిన పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్‌లో స్థానిక యువకుల ఫొటోలు కూడా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.