ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ.. టీడీపీ నేత అరెస్ట్

ఏపీ మంత్రి తానేనటి వనిత సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలంరేపింది. ఏకంగా మంత్రి లెటర్ హెడ్‌తో పాటూ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి వనిత సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. తన లెట్ హెడ్‌ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డప్పపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం ఏపీ అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.

కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి లెటర్ హెడ్, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఆ లెటర్ హెడ్‌పై మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు లేఖ రాసినట్లు గుర్తించారు. రెడ్డప్పకు అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్‌‌ను ఆ లేఖలో కోరినట్లు మాయ చేశాడు. కానీ మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో రెడ్డప్ప అడ్డంగా దొరికిపోగా.. అతడు టీడీపీ నేతని తెలుస్తోంది.