రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచిన ఎపి

15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా ఎపి నిలిచింది. రాష్ట్రం నుండి వందకు వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మరే రాష్ట్రంలోనూ వంద శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పడలేదు. ఎపిలో అధికార వైసిిపితో పాటు టిడిపి కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఓట్లు గంపుగుత్తగా ముర్ముకే పడ్డాయి. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నేతగా, రెండవ మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ద్రౌపది ముర్ము కావడం గమనార్హం. మొత్తంగా ద్రౌపది ముర్ముకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి.