ప్రముఖ దర్శకుడికి గుండెపోటు.. పరిస్థితి విషమం

సాచీగా పాపులర్ అయిన ప్రముఖ మలయాళ రచయిత, దర్శకుడు కె.ఆర్.సచ్చిదానందన్ గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు త్రిశూర్‌లోని జూబిలీ మిషన్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకి క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. 48 ఏళ్ల సాచీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు.

జూబిలీ మిషన్ హాస్పిటల్ డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. త్రిశూర్‌లోని వేరే హాస్పిటల్‌లో సాచీకి టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ శస్త్రచికిత్స జరిగిన కొన్ని గంటల్లోనే సాచీకి గుండెపోటు వచ్చింది. అంతేకాకుండా మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయింది. దీంతో వెంటనే సాచీని జూబిలీ మిషన్ హాస్పిటల్‌కు మార్చారు. ప్రస్తుతం సాచీకి మెకానికల్ వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నట్టు మెడికల్ రిపోర్ట్ పేర్కొంది. నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో సాచీకి చికిత్స అందుతోంది. సాచీ నాడీవ్యవస్థ సరిగా పనిచేయడం లేదని, మెదడు కూడా దెబ్బతిన్నట్టు సీటీ స్కాన్‌లో గుర్తించామని డాక్టర్లు తమ నివేదికలో పేర్కొన్నారు.