యానిమల్‌ విలన్‌ కంగువ చిత్రంలో ఎంట్రీ..

హిందీ చిత్రాలలో హీరో గా నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన బాబీ డియోల్‌ ఇప్పుడు ప్రతి నాయకుడిగా విజృంభిస్తున్నారు. ఇటీవల యానిమల్‌ చిత్రంలో విలన్‌గా ఇరగదీశారు. తాజాగా దక్షిణాదిలోనూ సత్తా చూపేందుకు సిద్ధం అయ్యారు. ముఖ్యంగా కోలీవుడ్‌కు కంగువ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో సూర్య హీరోగా ,బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, కోవై సరళ, రెడిన్‌ కింగ్స్‌లీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సూర్య ఇటీవలే డబ్బింగ్‌ను పూర్తి చేశారు. కంగువ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తిలకించడానికి బాబీడియోల్‌ గురువారం చైన్నెకి చేరుకున్నారు. దీంతో ఆయనకు కంగువ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్‌ రాజా ఘనస్వాగతం పలికారు. కంగువ చిత్రాన్ని 10 భాషల్లో త్రీడీ ఫార్మెట్లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.