అమ్మ మరణం.. నాలుగురోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ అమ్మ చెంతకు.. కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో ఉంది. ఆయనకు టాలీవుడ్ పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది. 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైనికుడు’ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు ఇర్పాన్ ఖాన్. మినిస్టర్ పప్పు యాదవ్‌గా ఆయన చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.

గత కొంత కాలంగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే సరిగ్గా నాలుగురోజుల క్రితం అంటే శనివారం నాడు ఇర్పాన్ ఖాన్ తల్లి సయిదా బేగం.. రాజస్థాన్లోని జైపుర్లో క‌న్నుమూశారు. అప్పటికి ఆరోగ్యంగానే ఉన్న ఇర్ఫాన్ ఖాన్.. లాక్ డౌన్ నిబంధనల వల్ల ముంబై నుంచి జైపూర్ వెళ్లలేకపోయారు. తన తల్లి కడచూపుకు దూరమయ్యారు. తల్లి సయిదా బేగం అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారానే ఇర్ఫాన్ చుశారని అతని సన్నిహితులు తెలియజేస్తున్నారు.

అయితే తల్లి చనిపోయిన నాలుగురోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ లోకాన్ని విడవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిని వదిలి నాలుగురోజులైనా ఉండలేకపోయావా? ఇర్ఫాన్ అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు.