మద్యం ధరలు అందుకే పెంచాం -సీఎం జగన్
మద్యం ధరలు అందుకే పెంచాం -సీఎం జగన్

మద్యం ధరలు అందుకే పెంచాం -సీఎం జగన్

దశల వారీ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లండిచారు. ఇదే సమయంలో అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.లిక్కర్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎలా జరుగుతుందో అన్న విషయాన్నిన్ని టీవీఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలి. మనం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నాం. మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశాం. అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం. షాక్‌ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, అలాగే రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. దీనికోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాం. లిక్కర్, ఇసుక మీద కలెక్టర్లు, ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్‌ సిబ్బంది మాత్రమే పూర్తిగా నియంత్రించలేరు. పోలీసులు దీంట్లో భాగస్వామ్యం కావాలి. అక్రమ మద్యం రవాణా, మద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష అనేది ఉండకూడదని కలెక్టర్లకు, ఎస్పీలకు గట్టిగా చెప్తున్నా. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ అంశాలను దగ్గరుండి నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల’ని వైఎస్‌ జగన్‌ అన్నారు.