ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. వేడుకల్లో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్‌.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పింగళి వెంకయ్య జీవితంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కాగా.. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొననున్నారు. అయితే జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు సరైన నివాళి దక్కలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆగస్టు 2న ఆయన జయంతి సందర్భంగా స్వగ్రామం భట్లపెనుమర్రులో నివాళి అర్పించే ఏర్పాట్లు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించకపోవడంతో జెండాల కోసం కూడా గ్రామస్థులు స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది.