శాశ్వతంగా టెలీ మెడిసిన్‌.

శాశ్వతంగా టెలీ మెడిసిన్‌..జగన్‌ కీలక ఆదేశాలు

కరోనా వైరస్ వంటి విపత్తులను ఎదుర్కోవడానికి వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. కోవిడ్- 19 నిరోధక చర్యలపై సీఎం జగన్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు వెలుగు చూసినందున ఆ జిల్లాలో పర్యవేక్షణకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

కరోనా పరీక్షల కోసం ల్యాబ్‌లు లేని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో టెలీ మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం ఆదేశించారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని, దీనివల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. టెలీమెడిసిన్‌ టోల్ ఫ్రీ నెంబరు 14410కు మరింత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు.