చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ ట్వీట్

ఏపీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖాముఖి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వెల్లడించారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ ను చట్టసభకు పంపించేందుకు తాము టికెట్ ఇచ్చామని, దీనిపై టీడీపీ నేతలు అవవేళన చేస్తున్నారని తెలిపారు.

ఇదే అంశంపై సీఎం జగన్ సోషల్ మీడియాలోనూ స్పందించారు. “జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగకుండా… వేలిముద్రగాడంటూ వీరాంజనేయులును అవమానించాడు. చంద్రబాబూ… నువ్వు కోట్లకు కోట్లు డబ్బులు ఉన్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా… నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ!” అంటూ ట్వీట్ చేశారు.