కేసీఆర్ అమ్ములపొదిలో నుంచి రెండు కొత్త పథకాలు వదలడానికి రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్ సర్కార్ త్వరలో ప్రవేశపెట్టనున్న కీలక పథకాల గురించి మంత్రి గంగుల కమలాకర్ హింట్ ఇచ్చారు. గురువారం (ఫిబ్రవరి 27) అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కొత్త పథకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ రెండు పథకాలను బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలు చేయనున్నారు. వీటితో పాటు సీఎం కేసీఆర్ త్వరలో మరిన్ని పథకాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘కేసీఆర్ ఆపద్బంధు’ పేరుతో ఎంబీసీ యువకుల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు ఎంబీసీ యువకులకు ఒకటి చొప్పున అంబులెన్స్‌లను పంపిణీ చేయనున్నారు. తద్వారా రెండు రకాల ప్రయోజనాలు కలిగేలా పథకానికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మారుమూల పల్లెలకు అంబులెన్స్ సేవలను విస్తరించడం అందులో ఒకటి కాగా.. అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను యువకులకు అప్పగించి, తద్వారా నిరుద్యోగులకు ఆర్థికంగా చేయూతనివ్వడం మరో అంశం. తొలుత జిల్లాకొక అంబులెన్స్ చొప్పున పంపిణీ చేసి.. స్పందన చూసిన అనంతరం విస్తృతంగా పంపిణీ చేసే ఆలోచనలో టీఆర్‌ఎస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.