కరీంనగర్ ప్రజలు తరిమికొడితే పాలమూరు వలస వచ్చారు..!

ఒకాయనను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమికొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయనను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీశ్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది లేదని, కృష్ణా జలాల్లో 68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు… ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా సభకు వచ్చి మద్దతు పలకాల్సింది అన్నారు. మనం తెలంగాణ హక్కులు, తెలంగాణ నీటి కోసం ఒకే మాట మీద నిలబడ్డామని… ఆంధ్రప్రదేశ్‌కు, కేంద్రానికి ఒక సందేశాన్ని పంపించాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఫామ్ హౌస్‌లో దాక్కున్నారని విమర్శించారు.