ఇసుక వ్యవహారంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇసుక వ్యవహారంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇసుక వ్యవహారంపై ఫోకస్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, అధికారుతో ఇసుకపై సమీక్ష నిర్వహించారు. కరోనా, లాక్‌డౌన్ తర్వాత రీచ్‌లన్నీ మూతబడ్డాయని.. ఇప్పుడిప్పుడే మళ్లీ రీచ్‌లు ప్రారంభమవుతున్నాయని అధికారులకు సీఎంకు వివరించారు. వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తిని చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించాలన్నారు సీఎం. శాండ్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయగానే నిల్వలు ఖాళీ అవుతున్నాయనే భావన ఉండకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నదుల పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకు పంచాయతీ కార్యదర్శి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న షరతు ఉంటుంది. ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లి వేరే చోట నిల్వ చేసి, విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు అమలు చేయనున్నారు.