తాడిపత్రిలో 500 బెడ్ల కోవిడ్‌ ఆసుపత్రి ప్రారంభించిన జగన్

అనంతపురం జిల్లా తాడిపత్రి అర్జాస్‌స్టీల్‌ వద్ద ఏర్పాటు చేసిన 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 11.50ఎకరాల విస్తీర్ణంలో లక్ష చదరపు అడుగులలో అత్యాధునిక సౌకర్యాలతో కేవలం రెండు వారాల రికార్డు సమయంలో ఈ ఆసుపత్రిని నిర్మించారు. దీనికోసం జర్మన్‌ హ్యంగర్‌ను వాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ ఆసుపత్రికి పక్కనే ఉన్న ఆర్జాస్‌ స్టీల్స్‌ నుండి ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రికార్డు సమయంలో ఆసుపత్రిని పూర్తి చేసినందుకు కలెక్టర్‌ గంధం చంద్రుడిని, సహకరిస్తున్న ఆర్జాస్‌ స్టీల్‌ ఎండి శ్రీధర్‌ కృష్ణమూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం ఆళ్లనాని , మున్సిపల్‌ శాఖ మంత్రి బత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆర్యోగ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరు కాటమనేని భాస్కర్‌, ఎంపిఎంఎస్‌ఐడిసి ఎండి విజయరామరాజు పాల్గన్నారు. తాడిపత్రి నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపిలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గన్నారు.