టాలీవుడ్ లో మరో విషాదం..

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ కన్నుమూశారు. ఈ విషాదాన్ని మర్చిపోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ గరిమెళ్ల విశ్వేశ్వరరావు 62 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నై సిరుచ్చేరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వేశ్వరరావు భౌతికకాయాన్ని ఈరోజు అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.