పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం

 పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు చరణ్‌జిత్‌ చన్నీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ను కలిసి అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ చన్నీతో ప్రమాణం చేయించారు. చన్నీ తర్వాత కాంగ్రెస్‌ నేతలు సుఖిందర్‌ ఎస్‌ రంధ్వానా, ఓపీ సోని ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పంజాబ్‌ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌, రాష్ట్ర పిసిసి చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ హాజరయ్యారు.