చిన్నారులపై Covaxin ట్రయల్స్‌ పూర్తి

చిన్నారుల కోవాగ్జిన్‌ టీకాపై రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను భారత బయోటెక్‌ సంస్థ పూర్తి చేసింది. ఈ క్లినికల్‌ పరీక్షల డేటాను వచ్చే వారంలో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ)కు అందించనున్నట్లు సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కఅష్ణ ఎల్లా తెలిపారు. వయోజనులకు అందించిన టీకా మాదిరిగానే పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్‌ ఉంటుందని అన్నారు. పిల్లల టీకాపై క్లినికల్‌ పరీక్షల డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. దాదాపు 1,000 మంది వాలంటీర్లపై పిల్లల కోవాగ్జిన్‌ను ప్రయోగించామని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతులపై రెండు రోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండియా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కఅష్ణ ఎల్లా మాట్లాడారు. కంపెనీ అభివఅద్ధి చేస్తున్న ముక్కు ద్వారా తీసుకునే కొవిడ్‌ వ్యాక్సిన్‌పై రెండో దశ క్లినికల్‌ పరీక్షలు అక్టోబరు నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సెప్టెంబరులో 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నామని.. అక్టోబరు నెలలో ఇది 5.5 కోట్ల డోసులకు పెంచుతామని అన్నారు. భాగస్వామ్య తయారీదారులు ప్రమాణాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైతే.. నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం కష్టతరమేమీ కాదని అన్నారు.