హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా..?

 హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఎప్పుడు? ఎన్నికల కమిషన్‌ ఏమి ఆలోచిస్తున్నది? ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాల ఉపఎన్నికలకు ఇప్పుడప్పుడే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నదా? దీనిపై రాజకీయవర్గాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. హుజురాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అదిగో.. ఇదిగో అంటూ సోషల్‌ మీడియాలో రోజుకో తేదీ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈ నెల 9న దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. ‘ఎన్నికల సమయంలో పాటించాల్సిన కొవిడ్‌ నియమాల గురించి మేం (ఈసీ) సవివరంగా పేర్కొన్నాం. ఇవి మా వెబ్‌సైట్‌లోకూడా ఉన్నాయి. 2021-22లో ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు, పలు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉన్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలు.. మీ సూచనలు సలహాల కోసం విజ్ఞప్తి’ అంటూ రాసిన ఈ లేఖలో ‘ దేశంలో కరోనా మహమ్మారి నెలకొన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల ప్రచారం చేయాల్సిన తీరుకు సంబంధించి మేం (ఎన్నికల సంఘం) ఇప్పటికే పలు ఆదేశాలు, మార్గదర్శకాలు, సూచనలు జారీచేశాం. అయితే 2021-22లో దేశంలోని ఐదు రాష్ర్టాల (ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌) అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అలాగే పలు రాష్ర్టాల్లో ఉపఎన్నికలు కూడా జరపాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో కమిషన్‌ గతంలో పేర్కొన్న మార్గదర్శకాలు, సూచనలు, ఆదేశాలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ఆగస్ట్‌ 30లోగా పంపించాలి. మీరిచ్చే సూచనల ఆధారంగా మరిన్ని సవివరమైన మార్గదర్శకాలను మేం తయారుచేస్తాం’ అని ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పేరుతో ఈ లేఖ విడుదలయింది.