కేసీఆర్‌ దారిలోనే ఈటల

ఏది ఏమైనా ఈ రాజకీయ అనిశ్చిత్తిలో ఉండిపోయిన మాజీ మంత్రి ఈటల గ్రహశాంతి జరిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాగాలు చేస్తే గండం గట్టెక్కి మళ్లీ పూర్వ వైభవం కలిసివస్తుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడు రోజులుగా శామిర్‌పేట్‌లోని ఆయన నివాసంలో జరుగుతున్న పూజలు దీనికి బలం చేకూరుస్తోంది. తాజా పరిణామాల నుండి ఉపశమనం పొందేందుకు, రాబోయే రాజకీయ భవిష్యత్తు సాఫీగా సాగేందుకు, శత్రువుల నుండి రక్షణ కోసం మాజీ మంత్రి ఆరుగురు పండితులతో యాగాలు, పూజలు చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే, కేసీఆర్‌కు కూడా పూజలు యాగాలపై నమ్మకం ఎక్కువ. తరచూ ఆయన ఫాంహౌస్‌లో చండీ యాగం వంటివి జరిపిస్తుంటారు. ముహూర్తాల విషయంలో కేసీఆర్ పక్కాగా ఉంటారు. అయితే, ఈటలకు కూడా వాటిపై నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ మారే ముందు శాంతి పూజలతో పాటు శత్రువుల నుండి రక్షణ కోసం శత్రు సంహరక పూజలు, దోష నివారణ పూజలు చేయిస్తున్నట్టు సమాచారం. మూడు రోజులుగా ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పూజలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.