టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ రాజీనామా

టిఆర్‌ఎస్‌ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధానికి… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలో ఉన్న తన నివాసంలో రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ… తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని అన్నారు. ఉద్యమం నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీలో తన పాత్రను వివరించడంతోపాటు తనకు ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా మీడియా ముందు వెల్లడించారు.   టిఆర్‌ఎస్‌ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. అప్పటి సిఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో తనను అవహేళన చేశారని, పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లామన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్‌ ప్రజలు గెలిపించారని అన్నారు.