గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఇకపై రీఛార్జ్‌లు కూడా..!

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో దొరకనిదంటూ ఉండదని మనకు తెలిసిన విషయమే. ఏదైనా మనకు అనుమానం వస్తే వెంటనే గూగుల్‌ తల్లి ఉంది కదా అంటూ వెంటనే మొబైల్‌ను వాడుతున్న యూజర‍్లకు గూగుల్‌ ఇప్పుడు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్‌ సంస్థ దేశంలోని టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలతో భాగస్వామ్యం అయింది.

ఈ క్రమంలో యూజర్లు గూగుల్‌ సెర్చ్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జ్‌ అని టైప్‌చేసి సెర్చ్‌ చేస్తే వచ్చే ఆప్షన్‌లలో తమ మొబైల్‌ నెంబర్‌, ఆపరేటర్‌, ప్లాన్‌ వివరాలను ఎంటర్‌ చేసి అక్కడి నుంచి నేరుగా తమ మొబైల్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. అందుకుగానూ.. పేటీఎం, ప్రీచార్జ్‌, గూగుల్‌ పే తదితర పేమెంట్‌ ఆప్షన్లను గూగుల్‌ అందిస్తున్నది.