గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రాజీనామా!

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు ఇచ్చారు. కాగా, వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం వెనుక గల కారణాలు తెలియరాలేదు. విజయ్‌ రూపానీ 2016 నుంచి గుజరాత్‌ సిఎంగా ఉన్నారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది పాటు ఉంది. అయితే, బిజెపి అధిష్టానం ఆదేశాలతోనే ఆయన సిఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కొత్త నాయకత్వం నేతృత్వంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇటీవలే కర్ణాటక సిఎం యడియూరప్పను కూడా బిజెపి అధిష్టానం మార్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్‌ రావత్‌, తీరథ్‌ సింగ్‌ రావత్‌ కూడా సిఎం పదవికి రాజీనామా చేశారు.