రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించ నున్నాయని, ఉత్తర బంగాళాఖాతంలో అంతటికీ వ్యాపించి వర్షాలకు అనువైన పరిస్థితులు ఏర్పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల శుక్రవారం వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్‌, రాజమహేంద్ర వరం, రాజవొమ్మంగి, అమలాపురం, మండపేట మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.