టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొత్తానికి ఓ ఇంటివాడైపోయాడు. ప్రేయసి పల్లవిని వివాహమాడి భర్తగా ప్రమోషన్ కొట్టేశాడు. ఈ రోజు (మే 14) ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పెద్దలు నిశ్చయించిన ముహార్తానికి నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ శామిర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.
భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి కోసమై ఏప్రిల్ 16వ తేదీ ఫిక్సయ్యారు. అయితే, పెళ్లి తేదీకి సుమారు నెల రోజుల ముందు లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో రెండు కుటుంబాలు చర్చించుకుని మే 14వ తేదీని ఖరారు చేసుకున్నాయి. లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు, తెలంగాణ ప్రభుత్వం మే 29 వరకు పొడిగించడంతో ఇక ఈ పరిస్థితి ముగిసే వరకు పెళ్లిని వాయిదా వేయాలని నిఖిల్ నిర్ణయించుకున్నారు. కానీ, మంచి ముహూర్తాలు దరిదాపుల్లో లేకపోవడంతో ఈ రోజు పెళ్లి చేసుకున్నారు.