‘ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తి ఆరేళ్లుగా వేధిస్తున్నాడు ‘ : నిత్యామేనన్‌

ప్రేమిస్తున్నానంటూ సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని సినీ నటి నిత్యామేనన్‌ తెలిపారు. ఇటీవల ఓ కోలీవుడ్‌ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గన్న ఆమె తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై తాజాగా మరోసారి స్పందించారు. ”కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచి ఈ వార్తలు వెలువడుతున్నాయి. నిజం చెప్పాలంటే, అతడు దాదాపు ఆరేళ్ల నుంచి నన్నూ, నా కుటుంబాన్నీ వేధిస్తున్నాడు. వేర్వేరు ఫోన్‌ నంబర్ల నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. దాదాపు 30 ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేశా. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగించేవాడు. దాంతో మా ఇంట్లోవాళ్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నోసార్లు చెప్పారు. కానీ నేను అలా చేయకుండా క్షమించి వదిలేశా. అతడి మానసిక స్థితి బాగోలేదనుకుంటా.. వదిలేద్దాం అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. కానీ అతడింకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నాడు” అని నిత్యామేనన్‌ వివరించారు.